ప్రధాని మోదీతో కెనడా ప్రధాని ట్రూడో భేటీ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత పర్యటనలో ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, ఇంధన భద్రత, ఉన్నత విద్య, సైన్‌స అండ్ ఐటీ, మేధో సంపత్తి హక్కులు, అణు రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. ట్రూడో దేశమంతా పర్యటించడాన్ని ఉటంకిస్తూ.. భారత్‌లోని భిన్నత్వం ఈ పర్యటనలో ఆయనకు అర్థమై ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు.
కెనడా ప్రధాని భారత పర్యటన
భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఫిబ్రవరి 23న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు, కెనడా ప్రధాని పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పౌర అణు పరిజ్ఞానం, విద్య, ఐటీ, మేధోహక్కులు, క్రీడలు వంటి అంశాల్లో ఆరు ఒప్పందాలు కుదిరాయి. ప్రధానితో భేటీకి ముందు జస్టిన్ ట్రుడో భార్య, పిల్లలతో కలసి తాజ్‌మహల్, స్వర్ణదేవాలయం తదితర ప్రదేశాలను సందర్శించారు.
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భారత పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 17న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు విసృ్తత చర్చలు జరిపారు. అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం రౌహానీతో కలసి మోదీ సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మత్తు పదార్థాల రవాణా, సైబర్ నేరాలు తదితరాలను ప్రోత్సహిస్తున్న శక్తులను నిలువరించేందుకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయన్నారు. ఇరాన్‌లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహర్ నౌకాశ్రయాన్ని ఆయన స్వర్ణ ద్వారంగా అభివర్ణించారు. రౌహానీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు విషయంలో ఇరాన్, భారత్ ఉమ్మడి వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. భారత్, ఇరాన్‌ల మధ్య రాజకీయ, రాయబారాలకు మించిన చారిత్రక సంబంధం ఉందని రౌహానీ అన్నారు. ప్రాంతీయ సమస్యలను రాజకీయ చర్యలు, రాయబారాలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో కలసి తాను కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ఇరాన్ ఎప్పటికీ లోబడి ఉంటుందని రౌహానీ అన్నారు. ఈ ఒప్పందం రద్దయితే అమెరికా చింతించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అనుకూలంగా రౌహానీ మాట్లాడారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు భద్రతా మండలిలో వీటో అధికారాలు ఎందుకు లేవనీ, అణు బాంబులు కలిగిన వారికి కూడా వీటో అధికారాలు ఉన్నాయంటూ ఆయన భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికారు.
9 ఒప్పందాలపై సంతకాలు
ఉగ్రవాదం, భద్రత, వాణిజ్యం, ఇంధనం తదితరాల అంశాలపై చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య 9 ఒప్పందాలు కుదిరాయి. చాబహర్ నౌకాశ్రయంలో కార్యకలాపాలను భారత్ నిర్వహించేందుకు అవసరమైన ఒప్పందం, ద్వంద్వ పన్నులు, పన్నుల ఎగవేతను నివారించడం, రాయబార పాస్‌పోర్టులు కలిగిన వారికి వీసాల నుంచి మినహాయింపునివ్వడం, వైద్యం, ఇంధన రంగాలకు సంబంధించిన ఒప్పందాలు వాటిలో ఉన్నాయి. ఇరు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ తొమ్మిదింటితోపాటు రౌహానీ పర్యటన సందర్భంగా మరో 4 ఒప్పందాలు కూడా ఇరు దేశాల మధ్య కుదిరాయని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.
యూఏఈ పర్యటనలో మోదీ సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మోదీ ఫిబ్రవరి 11న జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ప్రసంగించారు. దాదాపు 140 దేశాలకు చెందిన 4 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత జనాభాలో 65 శాతం.. జనాభా 35 ఏళ్ల లోపువారేనని.. అందుకే సాంకేతికత ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందడుగేస్తోందని ఆయన తెలిపారు. ‘6 ఆర్’ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రీడిజైన్, రీమ్యానుఫ్యాక్చర్), ‘5 ఈ’ (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాల ద్వారానే మనం సంతోషంగా ఉంటామన్నారు.
సదస్సులో భాగంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057 వరకు 40 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
అనంతరం దుబాయ్ ఒపెరా హౌజ్‌లో 30 లక్షల భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ అబుదాబిలో నిర్మించతలపెట్టిన తొలి హిందూ దేవాలయం బీఏపీఎస్ నారాయణ్ ఆలయ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌స ద్వారా శంకుస్థాపన చేశారు.
అబుదాబి ఆయిల్‌ఫీల్డ్‌లో ఓఎన్‌జీసీ విదేశ్‌కి వాటా
ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్, దాని భాగస్వామ్య కంపెనీలు కలసి అబుదాబిలోని అతిపెద్ద ఆఫ్‌షోర్ చమురు క్షేత్రం(లోయర్ జుకమ్)లో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. ఈ కొనుగోలు విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు (రూ.3,840 కోట్లు). ఈ మేరకు ప్రధాని మోదీ, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ సమక్షంలో ఫిబ్రవరి 10న ఈ ఒప్పందం కుదిరింది.
చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న యూఏఈలోకి ఓ భారత కంపెనీ అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఈ ఒప్పందం 40 ఏళ్లు అమల్లో ఉంటుంది. ఓఎన్‌జీసీ విదేశ్‌తోపాటు ఐవోసీ, బీపీసీఎల్ ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం లోయర్‌జుకమ్ ఆయిల్ ఫీల్డ్‌లో నిత్యం 4 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. 2025 నాటికి రోజుకు ఉత్పత్తిని 4.5 లక్షల బ్యారెళ్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం.
పాలస్తీనా పర్యటనలో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించగా ఆరు ఒప్పందాలు కుదిరాయి. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్ దాదాపు 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు.
పాలస్తీనా పర్యటన సందర్భంగా ఆ దేశం మోదీని పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో సత్కరించింది. ఈ పర్యటనతో పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధానిగా మోడీ నిలిచారు.
ప్రధాని మోదీ ఒమన్ పర్యటనఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. ఒమన్ పర్యటనలో భాగంగా మోదీ ఫిబ్రవరి 12న ఆ దేశ సుల్తాన్ ఖబూస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై విసృ్తతంగా చర్చించిన మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందంతో పాటు వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం వంటి ఒప్పందాలు ఉన్నాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
జోర్డాన్ రాజుతో భేటీ అయిన మోదీ
పశ్చిమాసియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 9న జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ఆ దేశ రాజు అబ్దుల్లా-2తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
పాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లలో మోదీ పర్యటనరక్షణ, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రధాని మోదీ పశ్చిమాసియా పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకూ పాలస్తీనా, యునెటైడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దుబాయ్‌లో జరిగే ఆరో వరల్డ్ గవర్న్‌మెంట్ సదస్సులో ప్రసంగించడంతో పాటు ఒపేరా హౌస్‌లో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. అలాగే అబుదాబి, దుబాయ్ నగరాల మధ్య హిందూ దేవాలయం నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌స ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు. ఒమన్ పర్యటనలో భాగంగా మస్కట్‌లోని 200 ఏళ్ల శివాలయాన్ని, సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శిస్తారు. మూడు దేశాలతో సాగే చర్చల్లో ఉగ్రవాద నిరోధం చాలా కీలక అంశంగా ఉంటుంది.
సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటన
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేపాల్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఆమె ఫిబ్రవరి 2 నుంచి రెండు రోజులపాటు నేపాల్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు.