Thursday, 28 June 2018

మార్చి 2018 ద్వైపాక్షిక సంబంధాలు

జర్మనీ అధ్యక్షుడితో మోదీ చర్చలు ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్.. మార్చి 25న ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా... వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉన్న మార్గాలపై మోదీ, వాల్టర్‌లు చర్చించారు. అంతకుముందు వాల్టర్.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అనంతరం... మార్చి 25న చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఫ్రాంక్ వాల్టర్.. మార్చి 26న మహాబలిపురం ఆలయాన్ని సందర్శించారు. 

భగత్ సింగ్ డాక్యుమెంట్లను ప్రదర్శించిన పాకిస్తాన్
భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్‌ను ఉరి తీసి 87 ఏళ్లు అవుతున్న సందర్భంగా పాక్ ప్రభుత్వం అతనికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచింది. మార్చి 26న లాహోర్‌లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్దగల పంజాబ్ రాష్ట్ర ఆర్కైవ్‌‌స విభాగంలో వీటిని ప్రదర్శించారు. ఇందులో భగత్ సింగ్‌కు ఉరి శిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీ, ఆయన చదివిన పుస్తకాలు, జైల్లో ఉన్నప్పుడు వార్తాపత్రికల కోసం భగత్ సింగ్ పెట్టుకున్న దరఖాస్తులు, కుమారుడి ఉరిశిక్షను రద్దు చేయాలంటూ భగత్ సింగ్ తండ్రి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్, ఉరి శిక్షను అమలు చేసినట్లు లాహోర్ జైలు సూపరింటెండెంట్ సంతకంతో ఉన్న పత్రం, జైలు నుంచి భగత్‌సింగ్ తన తండ్రికి రాసిన లేఖలు, కళాశాలలో భగత్ సింగ్ అడ్మిషన్ పొందిన రికార్డులు వంటి వాటిని ప్రదర్శనకు ఉంచారు. భగత్ సింగ్‌ను మార్చి 23, 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. 


ఐరాసలో కశ్మీర్‌పై పాక్ వాదనను ఎండగట్టిన భారత్ 
కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐరాసలో పాక్ చేసిన ఆరోపణలను భారత్ సమర్థవంతంగా ఎండగట్టింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ ఒక ‘విఫల దేశం’అనీ, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన గత్యంతరం తమకు లేదని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న పాక్ ఆరోపణలకు ఐరాసలో భారత సహాయ కార్యదర్శి మినీదేవి కుమమ్ స్పందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అసలైన మానవహక్కుల ఉల్లంఘన అని అన్నారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన అంటూ పాఠాలు చెప్పే ముందు అక్కడ ఉగ్రవాదానికి ఊతమివ్వటం మానాలనీ.. ముంబై, పఠాన్‌కోట్, ఉదీ దాడులకు కారకులను గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌కు రక్షణ కల్పించిన పాక్‌లో హఫీజ్ సయీద్ వంటి ఎందరో ఉగ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని ఆమె అన్నారు. ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత సహాయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మాట్లాడుతూ..భారత ప్రభుత్వం కశ్మీర్‌ను ఆక్రమించుకుని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. 

భారత్-ఫ్రాన్స్ మధ్య 14 ఒప్పందాలు భారత్-ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడే దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయి. అత్యంత కీలకమైన రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార రక్షణతో పాటు మొత్తం 14 అంశాలపై భారత్-ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సహకారాన్ని విసృ్తతం చేయాలని, ఉగ్రవాదం కట్టడికి ఉమ్మడి చర్యలను పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు మార్చి 10న ఢిల్లీలో ప్రధానిమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 
ఒప్పందాల్లో సాయుధ దళాల పరస్పర సహకారం, రహస్య సమాచార రక్షణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు, రైల్వేలు, సౌరశక్తి, సముద్రతీర అవగాహన, మాదక ద్రవ్యాల నియంత్రణ మొదలైనవి ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం వివరాలను భారత్ వెల్లడించలేదు. 2016లో భారత్-ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.58 వేల కోట్లు. 


జోర్డాన్ రాజు భారత పర్యటన జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్.. భారత పర్యటనలో భాగంగా మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విసృ్తత స్థాయి చర్చలు జరిపారు. అనంతరం.. రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు సహా 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వైద్యం, మెడిసిన్, రాక్ ఫాస్పేట్, ఎరువుల దీర్ఘకాలిక సరఫరా, కస్టమ్స్ అంశాలు ఈ ఒప్పందాల్లో ఉన్నాయి.
అంతకముందు ‘ఇస్లామిక్ సంస్కృతి: అవగాహన పెంపొందించుట, సంయమనం’ అంశంపై నిర్వహించిన సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్‌తో కలిసి మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్యలు ఏ మతానికో వ్యతిరేకంగా చేస్తున్నవి కాదని, అమాయకులపై అకృత్యాలకు పాల్పడేలా యువతను రెచ్చగొడుతున్న ఆలోచనా విధానాన్ని తిప్పికొట్టేందుకేనని మోదీ పేర్కొన్నారు. ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకున్నప్పుడే పూర్తిస్థాయి సంక్షేమం, సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.


వియత్నాం అధ్యక్షుడిభారత పర్యటన
వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్.. భారత్ పర్యటనలో భాగంగా మార్చి 3న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం.. మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అణు ఇంధనం, వాణిజ్యం, వ్యవసాయం రంగాలతోపాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో సహకారం పెంచుకునేందుకు అంగీకరించారు. 

ఫిబ్రవరి 2018 ద్వైపాక్షిక సంబంధాలు

ప్రధాని మోదీతో కెనడా ప్రధాని ట్రూడో భేటీ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత పర్యటనలో ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, ఇంధన భద్రత, ఉన్నత విద్య, సైన్‌‌స అండ్ ఐటీ, మేధో సంపత్తి హక్కులు, అణు రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. ట్రూడో దేశమంతా పర్యటించడాన్ని ఉటంకిస్తూ.. భారత్‌లోని భిన్నత్వం ఈ పర్యటనలో ఆయనకు అర్థమై ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు.

కెనడా ప్రధాని భారత పర్యటన
భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఫిబ్రవరి 23న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు, కెనడా ప్రధాని పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పౌర అణు పరిజ్ఞానం, విద్య, ఐటీ, మేధోహక్కులు, క్రీడలు వంటి అంశాల్లో ఆరు ఒప్పందాలు కుదిరాయి. ప్రధానితో భేటీకి ముందు జస్టిన్ ట్రుడో భార్య, పిల్లలతో కలసి తాజ్‌మహల్, స్వర్ణదేవాలయం తదితర ప్రదేశాలను సందర్శించారు.

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భారత పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 17న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు విసృ్తత చర్చలు జరిపారు. అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం రౌహానీతో కలసి మోదీ సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మత్తు పదార్థాల రవాణా, సైబర్ నేరాలు తదితరాలను ప్రోత్సహిస్తున్న శక్తులను నిలువరించేందుకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయన్నారు. ఇరాన్‌లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహర్ నౌకాశ్రయాన్ని ఆయన స్వర్ణ ద్వారంగా అభివర్ణించారు. రౌహానీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు విషయంలో ఇరాన్, భారత్ ఉమ్మడి వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. భారత్, ఇరాన్‌ల మధ్య రాజకీయ, రాయబారాలకు మించిన చారిత్రక సంబంధం ఉందని రౌహానీ అన్నారు. ప్రాంతీయ సమస్యలను రాజకీయ చర్యలు, రాయబారాలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో కలసి తాను కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ఇరాన్ ఎప్పటికీ లోబడి ఉంటుందని రౌహానీ అన్నారు. ఈ ఒప్పందం రద్దయితే అమెరికా చింతించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అనుకూలంగా రౌహానీ మాట్లాడారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు భద్రతా మండలిలో వీటో అధికారాలు ఎందుకు లేవనీ, అణు బాంబులు కలిగిన వారికి కూడా వీటో అధికారాలు ఉన్నాయంటూ ఆయన భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికారు.
9 ఒప్పందాలపై సంతకాలు 
ఉగ్రవాదం, భద్రత, వాణిజ్యం, ఇంధనం తదితరాల అంశాలపై చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య 9 ఒప్పందాలు కుదిరాయి. చాబహర్ నౌకాశ్రయంలో కార్యకలాపాలను భారత్ నిర్వహించేందుకు అవసరమైన ఒప్పందం, ద్వంద్వ పన్నులు, పన్నుల ఎగవేతను నివారించడం, రాయబార పాస్‌పోర్టులు కలిగిన వారికి వీసాల నుంచి మినహాయింపునివ్వడం, వైద్యం, ఇంధన రంగాలకు సంబంధించిన ఒప్పందాలు వాటిలో ఉన్నాయి. ఇరు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ తొమ్మిదింటితోపాటు రౌహానీ పర్యటన సందర్భంగా మరో 4 ఒప్పందాలు కూడా ఇరు దేశాల మధ్య కుదిరాయని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.

యూఏఈ పర్యటనలో మోదీ సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మోదీ ఫిబ్రవరి 11న జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ప్రసంగించారు. దాదాపు 140 దేశాలకు చెందిన 4 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
భారత జనాభాలో 65 శాతం.. జనాభా 35 ఏళ్ల లోపువారేనని.. అందుకే సాంకేతికత ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందడుగేస్తోందని ఆయన తెలిపారు. ‘6 ఆర్’ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రీడిజైన్, రీమ్యానుఫ్యాక్చర్), ‘5 ఈ’ (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాల ద్వారానే మనం సంతోషంగా ఉంటామన్నారు.
సదస్సులో భాగంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ఇరు పక్షాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో భారత ఆయిల్ కంపెనీల కన్సార్షియానికి 10% రాయితీ కల్పించే చారిత్రక ఒప్పందం కూడా ఉంది. ఇది 2018 నుంచి 2057 వరకు 40 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాల్లోని భారత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. 
అనంతరం దుబాయ్ ఒపెరా హౌజ్‌లో 30 లక్షల భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోదీ అబుదాబిలో నిర్మించతలపెట్టిన తొలి హిందూ దేవాలయం బీఏపీఎస్ నారాయణ్ ఆలయ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా శంకుస్థాపన చేశారు.


అబుదాబి ఆయిల్‌ఫీల్డ్‌లో ఓఎన్‌జీసీ విదేశ్‌కి వాటా
ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్, దాని భాగస్వామ్య కంపెనీలు కలసి అబుదాబిలోని అతిపెద్ద ఆఫ్‌షోర్ చమురు క్షేత్రం(లోయర్ జుకమ్)లో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. ఈ కొనుగోలు విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు (రూ.3,840 కోట్లు). ఈ మేరకు ప్రధాని మోదీ, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ సమక్షంలో ఫిబ్రవరి 10న ఈ ఒప్పందం కుదిరింది.
చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న యూఏఈలోకి ఓ భారత కంపెనీ అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఈ ఒప్పందం 40 ఏళ్లు అమల్లో ఉంటుంది. ఓఎన్‌జీసీ విదేశ్‌తోపాటు ఐవోసీ, బీపీసీఎల్ ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం లోయర్‌జుకమ్ ఆయిల్ ఫీల్డ్‌లో నిత్యం 4 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. 2025 నాటికి రోజుకు ఉత్పత్తిని 4.5 లక్షల బ్యారెళ్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం.


పాలస్తీనా పర్యటనలో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్‌తో శాంతి ప్రక్రియలో భారత్ కీలక భూమిక వహించాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు, పాలస్తీనా-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలపై చర్చించగా ఆరు ఒప్పందాలు కుదిరాయి. పాలస్తీనా సామర్థ్య నిర్మాణం కోసం భారత్ దాదాపు 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.321 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మోదీ తెలిపారు.
పాలస్తీనా పర్యటన సందర్భంగా ఆ దేశం మోదీని పాలస్తీనా విదేశీ అతిథులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’తో సత్కరించింది. ఈ పర్యటనతో పాలస్తీనా అధికార పర్యటనకు వచ్చిన తొలి భారత ప్రధానిగా మోడీ నిలిచారు.


ప్రధాని మోదీ ఒమన్ పర్యటనఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. ఒమన్ పర్యటనలో భాగంగా మోదీ ఫిబ్రవరి 12న ఆ దేశ సుల్తాన్ ఖబూస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై విసృ్తతంగా చర్చించిన మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందంతో పాటు వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం వంటి ఒప్పందాలు ఉన్నాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.


జోర్డాన్ రాజుతో భేటీ అయిన మోదీ
పశ్చిమాసియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 9న జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ఆ దేశ రాజు అబ్దుల్లా-2తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

పాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లలో మోదీ పర్యటనరక్షణ, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రధాని మోదీ పశ్చిమాసియా పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకూ పాలస్తీనా, యునెటైడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దుబాయ్‌లో జరిగే ఆరో వరల్డ్ గవర్న్‌మెంట్ సదస్సులో ప్రసంగించడంతో పాటు ఒపేరా హౌస్‌లో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. అలాగే అబుదాబి, దుబాయ్ నగరాల మధ్య హిందూ దేవాలయం నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు. ఒమన్ పర్యటనలో భాగంగా మస్కట్‌లోని 200 ఏళ్ల శివాలయాన్ని, సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శిస్తారు. మూడు దేశాలతో సాగే చర్చల్లో ఉగ్రవాద నిరోధం చాలా కీలక అంశంగా ఉంటుంది. 

సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటన
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేపాల్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఆమె ఫిబ్రవరి 2 నుంచి రెండు రోజులపాటు నేపాల్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు.








Sunday, 11 February 2018

జనవరి 2018 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్ - కంబోడియా మధ్య 4 ఒప్పందాలు భారత్-కంబోడియాల మధ్య రక్షణ బంధాల బలోపేతానికి కృషి చేయాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్వీర్యం చేయటంలో అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయటంపై కలిసి పోరాడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కంబోడియా ప్రధానమంత్రి హున్‌సేన్‌ల మధ్య జనవరి 27న రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరసాయానికి చర్చలు జరిగాయి. అనంతరం వీరిరువురి సమక్షంలో ఇరుదేశాల మధ్య 4 ఒప్పందాలపై ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింత, నేర సంబంధిత విచారణకు న్యాయసాయం, కంబోడియాలోని స్వా హబ్ నీటి వనరుల అభివృద్ధి ప్రాజెక్టుకు భారత రుణసాయం (దాదాపు రూ.234 కోట్లు) అంశాలపై ఈ ఒప్పందాలు చేసుకున్నారు.

మోదీకి కానుకగా నీటిశుద్ధి యంత్రం భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకమైన కానుక అందజేశారు. నీటిలోని లవణాలు తొలగించి శుద్ధిచేసే ‘గాల్-మొబైల్ వాటర్ డీసాలినేషన్ అండ్ ప్యూరిఫికేషన్ జీప్’ను కానుకగా ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా బావ్లా సమీపంలో జనవరి 17న జరిగిన కార్యక్రమంలో ఈ నీటి శుద్ధి యంత్రాన్ని మోదీకి అందజేశారు. ఈ వాహనాన్ని నెతన్యాహు సమక్షంలోనే బసకంఠ జిల్లా సుయిగామ్ (భారత్-పాక్ సరిహద్దుల్లోని గ్రామం) ప్రజలకు మోదీ అంకితం చేశారు. సరిహద్దుల్లోని సుయిగామ్‌లో ఇది ఉంటుందని.. దీనిద్వారా సరిహద్దులోని జవాన్లకు శుద్ధమైన తాగునీరు అందుతుందని మోదీ పేర్కొన్నారు. 

ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారత్‌కు చోటు క్షిపణి సాంకేతికత నియంత్రణ కూటమి (ఎంటీసీఆర్), వాసెనార్ గ్రూప్‌లలో స్థానం దక్కించుకున్న భారత్‌కు జనవరి 19న జీవ, రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ అయిన ఆస్ట్రేలియా గ్రూప్‌లోనూ చోటు దక్కింది.
జీవ, రసాయనిక ఆయుధాలను అభివృద్ధి చేసుకోకుండా.. వీటి తయారీకి అవసరమైన పరికరాలు, ముడిపదార్థాలు, సాంకేతిక వ్యాప్తిని వ్యతిరేకించే దేశాలను సమన్వయం చేసే, సామరస్యపూర్వక ఎగుమతుల నియంత్రణను పర్యవేక్షించే స్వచ్ఛంద సంస్థగా ఆస్ట్రేలియా గ్రూప్ (ఏజీ) పనిచేస్తోంది. అణ్వాయుధ నిరాయుధీకరణ లక్ష్యాలను చేరుకోవటం, అంతర్జాతీయ భద్రతలో ఈ సభ్యత్వం పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ఏజీలో సభ్యత్వం భారత విశ్వసనీయత మరింత పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. 2016లో ఎంటీసీఆర్‌లో, గతేడాది వాసెనార్ గ్రూప్‌లో భారత్ సభ్యత్వం పొందింది. 

ఆకర్షణీయ నగరాల జాబితాలోకి మరో తొమ్మిదిఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో కొత్తగా తొమ్మిది నగరాలు చేరాయి. దీంతో వీటి సంఖ్య 99కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, మొరాదాబాద్, సహరన్‌పూర్; తమిళనాడులోని ఈరోడ్; బిహార్‌లోని బిహార్‌షరీఫ్, దాద్రా నగర్ హవేలీలోని సిల్వాసా, లక్షద్వీప్‌లోని కవరత్తి; అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్ తదితర నగరాలు తాజా జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ జనవరి 19న ప్రకటన చేశారు.

ఢిల్లీలో భారత్ - ఆసియాన్ సదస్సు జనవరి 25, 26న ఢిల్లీలో భారత్-ఆసియాన్ సదస్సు జరగనుంది. సదస్సులో భాగంగా మహాకావ్యం రామాయణంలోని కొన్ని ఘట్టాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్‌‌స, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్-ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. 


భారతీయులను వెనక్కి పంపే ఒప్పందాలపై భారత్-బ్రిటన్ సంతకాలుచట్ట విరుద్ధంగా బ్రిటన్‌లో నివశిస్తున్న భారతీయులను వెనక్కి తిప్పి పంపేయడానికి సంబంధించిన రెండు ఒప్పందాలపై భారత్-బ్రిటన్‌లు లండన్‌లో 2018, జనవరి 13న సంతకాలు చేశాయి. ఉభయ దేశాల మధ్య కుదిరిన రెండు అవగాహన ఒప్పందాలపై భారత హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, బ్రిటన్ ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి కెరోలిన్‌నోక్స్ సంతకాలు చేశారు. 

భారత్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటన ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జనవరి 14న భారత్ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. ఢిల్లీ విమానాశ్రయంలో నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, ఇజ్రాయెల్‌లు సంతకాలు చేయనున్నాయి. 

తీన్ మూర్తి-హైఫా చౌక్‌గా పేరు మార్పు అంతకుముందు సెంట్రల్ ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ మెమోరియల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చౌక్ పేరును అధికారికంగా తీన్ మూర్తి- హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారతీయ సైనికులకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. తీన్ మూర్తి మెమోరియల్‌లోని సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు. 
తీన్‌మూర్తి చౌక్‌లోని మూడు కాంస్య విగ్రహాలు.. ‘15వ ఇంపీరియల్ సర్వీస్ బ్రిగేడ్’కు చెందిన హైదరాబాద్, జోధ్‌ఫూర్, మైసూర్ సైనికులకు ప్రతీక. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సెప్టెంబర్ 23, 1918న హైఫాకు ఒట్టొమాన్, జర్మనీ బలగాల నుంచి ఈ బ్రిగేడ్ విముక్తి కల్పించింది. 
15 ఏళ్ల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని ఒకరు భారత్‌లో పర్యటిస్తున్నారు. 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరన్ భారత్‌లో పర్యటించారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో ఆ దేశంతో సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగాక ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే.

భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా జనవరి 16న ఢిల్లీలో రైసినా డైలాగ్ భౌగోళిక-రాజకీయ మూడో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇస్లాం అతివాదం, ఉగ్రవాదుల చర్యలు అంత్యంత ప్రమాదకరమైనవనీ, అంతర్జాతీయ వ్యవస్థపై ఇవి తీవ్ర దుష్పరిణామాలు చూపగలవని నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్-ఇజ్రాయెల్ మధ్య మరింత బలమైన బంధం ఉండాలని ఆయన పేర్కొన్నారు. 
భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా జనవరి 15న ఇరు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల అధికారులు వీటిపై సంతకాలు చేశారు. అలాగే ఢిల్లీలో జనవరి 15న జరిగిన ఇండియా-ఇజ్రాయెల్ వాణిజ్య సదస్సులో మోదీ మాట్లాడుతూ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత అబివృద్ధి చేసుకునేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. 


స్పైక్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దుఇజ్రాయెల్‌కు చెందిన ఆయుధాల కంపెనీ రాఫెల్ అడ్వాన్‌‌స డిఫెన్‌‌స సిస్టమ్స్‌తో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. 1,600 క్షిపణుల కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.3 వేల కోట్లు. ఈ మేరకు ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం అందిందని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి వెల్లడించారు. 


ఆసియాన్-ఇండియా రౌండ్ టేబుల్ సమావేశంఆసియాన్-ఇండియా నెట్‌వర్క్ మేధావుల ఐదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న జకర్తాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సమష్టి భద్రత, సమష్టి సంపద’ అనే రెండు సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆకాంక్షించారు. ఆసియాన్ దేశాలు.. దృఢ, గతిశీల ఆర్థిక బంధాలను కలిగి ఉండాలన్నారు. ఈ దిశగా నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు.

ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్సింగపూర్‌లో జనవరి 7న జరిగిన ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత వేదికగా నిలిచారన్నారు.

ఎవరెస్టు ఎత్తు కొలవాలనే భారత్ ప్రతిపాదన తిరస్కరణనేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది. 
2015 నాటి‘గోర్ఖా భూకంపం నేపాల్‌ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్ ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత్ అధికారులు అంటున్నారు. 

 

డిసెంబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

నల్లధనం సమాచార ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్ సంతకాలు 

నల్లధనంపై సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్‌లు డిసెంబర్ 21న సంతకాలు చేశాయి. స్విట్జర్లాండ్ పార్లమెంట్‌లోనూ దీనికి సంబంధించిన విధానపర ప్రక్రియ ముగియడంతో జనవరి 1 నుంచి ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి ఆండ్రియాస్ బామ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆటోమేటిక్ సమాచార మార్పిడి(AEIO) ఉమ్మడి డిక్లరేషన్‌పై రెండు దేశాల మధ్య 2017 నవంబర్ నెలలోనే అవగాహన కుదిరింది. దీని వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలవుతుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండగా, తమకు అందిన సమాచారం గోప్యతను కాపాడతామని భారత్ స్విస్‌కు హామీ ఇచ్చింది. 


భారత్, చైనా మధ్య ‘సరిహద్దు’ చర్చలు భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు డిసెంబర్ 22న జరిగాయి. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సెలర్ యంగ్ జీచితోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాలేదు. 
భారత్, చైనా మధ్య 2017 జూన్ 16న తలెత్తిన డోక్లాం వివాదం 2017 ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసిన భార్య, తల్లి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ ఎట్టకేలకు తన భార్య, తల్లిని కలుసుకున్నారు. ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగశాఖ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాల సేపు జాధవ్.. భార్య చేతాంకుల్, తల్లి అవంతి మధ్య ఉద్వేగపూరిత సంభాషణ జరిగింది. అయితే వీరు నేరుగా కలుసుకునే అవకాశం లేకుండా మధ్యలో గాజు తెర ఏర్పాటు చేసిన పాక్ అధికారులు.. ఇరువైపులా ఫోన్ ద్వారా (ఇంటర్‌కామ్) మాట్లాడుకునే వీలు కల్పించారు. ఈ భేటీ మొత్తాన్ని ఫొటోలు, సీసీటీవీల ద్వారా రికార్డు చేశారు. వీరితోపాటు వచ్చిన భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను జాధవ్‌తో మాట్లాడేందుకు అనుమతించలేదు. 


ఐరాసకు అనుగుణంగానే ‘కశ్మీర్’ పరిష్కారంప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగానూ శాంతి, స్థిరత్వాలను సాధించాలంటే కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి తీర్మానాన్ని అనుసరించి భారత్, పాక్‌లు శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రష్యా, చైనా, ఇరాన్, టర్కీ, అఫ్గానిస్తాన్, పాక్ దేశాల పార్లమెంటు స్పీకర్లు ఇస్లామాబాద్‌లో సమావేశమై ఈ ప్రకటనను వెలువరించారు. తొలుత కశ్మీర్ అంశంపై చర్చించేందుకు రష్యా, ఇరాన్, అఫ్గాన్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఆయా దేశాలు తమకు రాజకీయంగా ప్రయోజనాలు చేకూర్చే అంశాలను చర్చల జాబితాలో చేర్చాయనీ, తమకూ కశ్మీర్ అంశమే ముఖ్యమని పాక్ పట్టుబట్టడంతో మిగతాదేశాలూ ఒప్పుకోక తప్పలేదు. 
అలాగే... చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు కలసి తొలిసారిగా డిసెంబర్ 26న బీజింగ్‌లో త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

చైనా విదేశీ పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారత్ ర్యాంక్ ఆరు స్థానాలు దిగజారి 37కు చేరింది. ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) 60 దేశాలకు సంబంధించి డిసెంబర్ 7న విడుదల చేసిన ‘చైనా గోయింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ 2017’ ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా (2), హాంకాంగ్ (3), మలేషియా(4), ఆస్ట్రేలియాలు (5) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, ఎనర్జీ ఫైనాన్షియల్ సేవలు, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఈ విషయంలో భారత్ ర్యాంక్ తగ్గడానికి ప్రధాన కారణం రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతలు.


సింగపూర్‌తో భారత్ రక్షణ ఒప్పందం రక్షణ రంగంలో పరస్పరం మరింత సహకరించుకునేందుకు భారత్ - సింగపూర్ 2017 నవంబర్ 29న ఒప్పందం కుదుర్చు కున్నాయి. ప్రధానంగా నౌకారంగంలో ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించు కోనున్నాయి. భారత రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్ మధ్య చర్చలు జరిగాయి. భారత యుద్ధ నౌకలు తమ నౌకా స్థావరాల్లో ఇంధనం నింపుకోవ డా నికి అవకాశం కల్పిస్తామని సింగపూర్ మంత్రి తెలిపారు. దక్షిణ చైనా సముద్రం లో నౌకలు తిరగడానికి స్వేచ్ఛ ఉండాలని ఇరు దేశాలు డిమాండ్ చేశాయి. ఉగ్రవాద అణిచివేత, రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకరించుకోవాలని నిర్ణయించాయి. 

వాసెనార్ బృందంలో భారత్ కు సభ్యత్వంఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందం (Wassenaar) లో భారత్ 42వ సభ్య దేశంగా చేరింది. ఈ మేరకు డిసెంబర్ 7న వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్ స్థాయి పెరగడంతో పాటు కీలక రక్షణ, అంతరిక్ష రంగాల్లో అధునాతన సాంకేతికతలను ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది.
Wassenaar Arrangement on Export Controls for Conventional Arms and Dual-Use Goods and Technologies లేదా Wassenaar Arrangement అనేది ఆయుధాల ఎగుమతులు, సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు పనిచేస్తోంది. 


ఢిల్లీలో ఆర్‌ఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వారి స్థావరాలను నిర్వీర్యం చేయాలని భారత్, చైనా, రష్యా నిర్ణయించాయి. ఈ మేరకు డిసెంబర్ 11న ఢిల్లీలో జరిగిన 15వ రష్యా, భారత్, చైనా (ఆర్‌ఐసీ) త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్ (భారత్), వాంగ్ యీ(చైనా), సెర్జీ లావ్రోవ్ (రష్యా) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై ఉమ్మడిగా చర్యలు చేపట్టాలని ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.


‘చాబహర్’ పోర్టును ప్రారంభించిన ఇరాన్భారత ఆర్థిక సాయంతో ఇరాన్‌లో నిర్మించిన చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ డిసెంబర్ 3న ప్రారంభించారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు వీలు కలుగుతుంది. ఇరాన్‌లోని సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్‌‌సలో నిర్మించిన ఈ పోర్టును భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయాలతో సులువుగా అనుసంధానం చేయవచ్చు. చైనా పెట్టుబడులతో పాకిస్తాన్‌లో నిర్మించిన గ్వాదర్ పోర్టుకు పోటీగా దీనిని భారత్ ఇరాన్‌లో నిర్మించింది.




నవంబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతుస్వతంత్ర పాలస్తీనా కోసం ఆ దేశ ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత్ మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’ సందర్భంగా ఐరాసకు ఆయన ఓ సందేశం పంపారు. ఇజ్రాయెల్‌తో పాటు శాంతియుతంగా జీవనం సాగించే స్వతంత్ర, సార్వభౌమ, సుస్థిర పాలస్తీనా కల త్వరలోనే నిజం అవ్వాలని భారత్ ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 1979 నుంచి ఏటా నవంబర్ 29ని ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’గా నిర్వహిస్తున్నారు.


ఉగ్రపోరులో సహకారానికి రష్యా అంగీకారం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకరించుకోవాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక ఒప్పందంపై భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రష్యా అంతర్గత మంత్రి కోలోకొత్సేవ్‌లు సంతకం చేశారు. తద్వారా 1993లో భారత్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. రష్యా పర్యటనలో భాగంగా నవంబర్ 27న రష్యా మంత్రితో రాజ్‌నాథ్ పలు అంశాలపై చర్చలు జరిపారు. సమాచార మార్పిడి విసృ్తతం చేయడంతో పాటు డేటాబేస్, పోలీసు, దర్యాప్తు విభాగాలకు శిక్షణలో సహకారానికి కూడా భారత్, రష్యాలు అంగీకరించాయి. 


భారత్‌తో సమాచార మార్పిడికి స్విస్ ఒప్పందం స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి కీలక ముందడుగు పడింది. భారత్‌తో ఆటోమేటిక్‌గా ఈ వివరాలు పంచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందానికి స్విట్జర్లాండ్ పార్లమెంట్ కమిటీ నవంబర్ 18న ఆమోదం తెలిపింది. భారత్‌తో పాటు మరో 40 దేశాలకు వర్తించే ఈ ఒప్పందానికి స్విట్జర్లాండ్ ఎగువ సభలోని ఆర్థిక వ్యవహారాలు, పన్ను ఎగవేతల కమిషన్ ఆమోదం తెలిపింది. సమాచార మార్పిడి జరిగిన తరువాత తలెత్తే వివాదాలను ఎదుర్కొనేలా నిబంధనలను పటిష్టం చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సూచించింది. ఇక తదుపరి దశలో ఈ ఒప్పందాన్ని నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎగువ సభలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే 2019 నుంచి ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది.

భారత్ - బంగ్లా వీక్లీ ‘బంధన్’ రైలు ప్రారంభం భారత్‌లోని కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడిచే ‘బంధన్’ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు నవంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలు సర్వీసులని ప్రారంభించారు. పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయం ఉన్న ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. రూ. 650 కోట్లతో నిర్మించిన బైరట్, టైటాస్ రైల్వే వంతెనలను కూడా ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు. 


ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన ఇండియా-ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల మండలి) 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12 నుంచి మూడు రోజులపాటు ఫిలిప్పీన్‌‌సలో పర్యటిస్తున్నారు. ఇండియా-ఆసియాన్‌తోపాటు మోదీ 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ పాల్గొంటారు. ఆసియాన్ 50వ వార్షికోత్సవ సంబరాలు, ప్రాంతీయ ఆర్థిక సమగ్ర భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) నేతల సమావేశం, ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో పాల్గొననున్నారు. ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తేతోపాటు అక్కడకు వచ్చే అన్ని దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు. 
ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్‌‌స జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్ టాగలాంగ్’ను ధరించి విందులో పాల్గొన్నారు. 

మనీలాలో ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు ఫిలిప్పీన్‌‌సలోని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా 45 నిమిషాల సేపు భేటీ అయ్యారు. విసృ్తతాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అమెరికా అంచనాలను భారత్ అందుకుంటుందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక బంధాల పరిధిని మించి మరింత విసృ్తతంగా, బలంగా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మార్పుల దృష్ట్యా ఆసియా భవిష్యత్తు కోసం భారత్-అమెరికాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్లు మోదీ పేర్కొన్నారు. 



ఆసియాన్ బిజినెస్ ఫోరంతో మోదీ సమావేశం ఆసియాన్ బిజినెస్ ఫోరం బృందంతో మోదీ సమావేశమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయని తద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు సువర్ణావకాశం ఉందని సమావేశంలో ప్రధాని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చాలా రంగాల్లో నిబంధనలను సరళీకృతం చేశామన్నారు. 




ఫిలిప్పీన్స్‌కు భారత వంగడాలుఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఆర్‌ఆర్‌ఐ జీన్ బ్యాంక్‌కు రెండు భారత వరి వంగడాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఐఆర్‌ఆర్‌ఐ పనిచేస్తోంది. ప్రకృతి విపత్తులను, వరదలను తట్టుకునేలా రూపొందించిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 18 రోజుల పాటు నీటిలో మునిగినా హెక్టారుకు 1-3 టన్ను ల వరి ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. 




Friday, 1 December 2017

అక్టోబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

ఇటలీ ప్రధాని భారత పర్యటనఇటలీ ప్రధాని పాలో జెంటిలోని రెండు రోజుల భారత పర్యటన కోసం అక్టోబర్ 29న న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జెంటిలోని ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సహా పలు రంగాల్లో సహకారానికి సంబంధించి విసృ్తతమైన చర్చలు జరిపారు. అనంతరం రైల్వే భద్రత, విద్యుత్, సంయుక్త పెట్టుబడుల ప్రోత్సాహం తదితర ఆరు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
2018 మార్చిలో ఇటలీతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ లోగోను విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం 8.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57 వేల కోట్లు) ద్వైపాక్షిక వ్యాపారం జరుగుతోంది.


ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్ పర్యటనఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ భారత పర్యటనలో భాగంగా అక్టోబర్ 27న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

యూఎస్ విదేశాంగ మంత్రి పర్యటనభారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ అక్టోబర్ 25న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా, హెచ్-1బీ వీసాలు, దక్షిణాసియాపై ట్రంప్ విధానం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.

అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ర భారత పర్యటనఒక రోజు పర్యటనకు భారత్ వచ్చిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్రఘనీ అక్టోబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఫ్గాన్ అవసరాల కు అనుగుణంగా అక్కడి రక్షణ, పోలీసు దళాలకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఘనీ ఢిల్లీలోని వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆసియాన్ రక్షణ మంత్రుల సదస్సుఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల నాలుగో సదస్సు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అక్టోబర్ 24న ముగిసింది. ఈ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాద అనుకూల శక్తులను సమర్థంగా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) నిర్ణయించింది. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ సదస్సులో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

భారత్ - రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు 
రక్షణ రంగంలో మరింత సహకారంలో భాగంగా భారత్ - రష్యాలు అక్టోబర్ 19 నుంచి 11 రోజుల పాటు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అన్న అంశంపై 'ఇంధ్ర-2017' పేరుతో రష్యాలో చేపట్టే ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలు పాల్గొంటాయి. సెర్గీవిస్కీలోని 249వ కంబైండ్ ఆర్మీ రేంజ్, వ్లాదివోస్తోక్ లోని జపాన్ సముద్రాల్లో ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. భారత్ తరపున 350 మంది ఆర్మీ, 80 మంది వైమానిక సిబ్బంది, రెండు ఐఎల్ -76 విమానాలు, నౌకదళానికి చెందిన ఒక యుద్ధ నౌక, ఒక సహాయక నౌక పాల్గొంటాయి. 


జపాన్‌తో భారత్ టీఐటీపీ ఒప్పందం యువతను టెక్నికల్ ఇంటర్న్స్‌గా జపాన్‌కు పంపేందుకు భారత్ ఆ దేశంతో టెక్నికల్ ఇంటర్న్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్(TITP)పై సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అక్టోబర్ 17న టోక్యోలో జరిగిన సమావేశంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, జపాన్ మంత్రి కత్సునోబు కాటో ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం జపాన్‌లో 3 నుంచి 5 ఏళ్ల పాటు ఉపాధి శిక్షణ కోసం భారత్ ఔత్సాహిక యువతీ యువకులను ఆ దేశం పంపిస్తుంది. 
జపాన్‌తో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్న మూడో దేశం భారత్. జపాన్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ దేశంలో 2016 చివరి నాటికి వివిధ దేశాలకు చెందిన 2.3 లక్షల మంది టెక్నికల్ ఇంటర్న్స్‌గా ఉపాధి శిక్షణ పొందుతున్నారు. 


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటనరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటనలో అక్టోబర్ 4న తూర్పు ఆఫ్రికా దేశం జిబూతీని సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు ఒమర్ గ్యులేహ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యాలయ స్థాయి ద్వైపాక్షిక సంప్రదింపులు నెలకొల్పుకునే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 2015లో యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్ నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆపరేషన్ రాహత్’లో జిబూతీ అందించిన తోడ్పాటుకు కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. నౌకా వాణిజ్య, సౌర విద్యుత్ రంగాల్లో పరస్పర సహకారంపై కోవింద్, ఒమర్ చర్చించారు. జిబూతీని సందర్శించిన తొలి భారతీయ నేత కోవింద్ కావడం గమనార్హం. జిబూతీలో చైనా తన విదేశీ సైనిక స్థావరాన్ని నెలకొల్పిన నేపథ్యంలో భారత రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇథియోపియాతో రెండు ఒప్పందాలు:
 రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇథియోపియా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ములాతు తెషోమేతో అడిస్ అబాబాలో చర్చలు జరిపారు. వాణిజ్యం, సమాచార-ప్రసార రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలపడేలా ఇరువురి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ)లో ఇథియోపియా భాగస్వామి కావడం పట్ల భారత్ కృతజ్ఞతలు తెలిపింది. భారత్- ఇథియోపియా 70 ఏళ్ల దౌత్య సంబంధాలు’ అనే పుస్తకాన్ని ఇరువురూ విడుదల చేశారు.


భారత్-ఈయూ 14వ సదస్సుఉగ్రవాదంపై పోరుకు ఒకరికొకరు సహకరించుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. ఈ మేరకు అక్టోబర్ 6న న్యూఢిల్లీలో జరిగిన భారత్-ఈయూ 14వ సదస్సులో ఇరు పక్షాలు ఒక ప్రకటన (డిక్లరేషన్)ను విడుదల చేశాయి. సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పాల్గొన్నారు.
వాణిజ్యం, భద్రత వంటి ప్రధాన అంశాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడం; రోహింగ్యా సంక్షోభం, కొరియా ద్వీపకల్పంలోని ఉద్రిక్త పరిస్థితులతో పాటు వివిధ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. మూడు ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. వీటిలో అంతర్జా తీయ సౌర కూటమికి సంబంధించిన ఒడంబడిక కూడా ఉంది.


బంగ్లాదేశ్‌కు రూ.29,250 కోట్ల రుణంపై ఒప్పందంబంగ్లాదేశ్‌లో మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధికి భారత్ రూ.29,250 కోట్ల రుణం ఇచ్చేందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు అక్టోబర్ 4న సంతకాలు చేశాయి. భారత్, బంగ్లా ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, అబుల్ మాల్ అబ్దుల్ ముహిత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

భారత్‌కు ఏఐఐబీ, ఏడీబీ 655 కోట్ల రుణంభారత్‌లో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడంతో పాటు సౌర, పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) రూ.655.63 కోట్ల(100 మిలియన్ డాలర్లు) రుణం అందించనున్నాయి. ఏఐఐబీ, ఏడీబీలు చెరో 50 మిలియన్ డాలర్ల చొప్పున ఈ రుణాన్ని ఇవ్వనున్నాయి. ఏఐఐబీ, ఏడీబీలు సంయుక్తంగా రుణాలు జారీ చేయడం ఇది నాలుగోసారి.
చైనా నేతృత్వంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 2016లో ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.06% పెట్టుబడితో మెజారిటీ వాటాదారుగా ఉండగా, భారత్ 7.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. రష్యా 5.93%, జర్మనీ 4.5శాతం పెట్టుబడితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 


భారత్‌కు మళ్లీ అమెరికా ‘చమురు’అమెరికా నుంచి ముడి చమురుతో బయలుదేరిన తొలి ఓడ ఒడిశా లోని పారదీప్ ఓడరేవుకు అక్టోబర్ 2న చేరింది. అతి పెద్ద ముడి చమురు రవాణా ఓడ ‘వీఎల్‌సీసీ ఎమ్‌టీ న్యూ ప్రాస్పెరిటీ’ ద్వారా 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అందినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలిపింది. మరో 3.95 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కోసంయూఎస్‌ను కోరినట్లు ప్రకటించింది. భారత్-యూఎస్ వాణిజ్య సంబంధాల్లో ప్రధానంగా చమురు-గ్యాస్ రంగాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైడ్రోకార్బన్ రంగాన్ని పటిష్టపరిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ నెలలో జరిపిన అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. 
1975లో అమెరికా చమురు ఎగుమతులను నిలిపివేసింది. దాదాపు 42 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగుమతులు ప్రారంభించింది. ఇలా సుదీర్ఘ విరామం అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా చమురు దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో ఒకటిగా భారత్ కూడా నిల్చింది.




సెప్టెంబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్‌ను ఎదుర్కొనేందుకే అణ్యాయుధాలు : పాక్అవసరమైతే భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారు చేసుకున్నామని పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ వెల్లడించారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్న షాహిద్ అబ్బాసీ.. సెప్టెంబర్ 21న జరిగిన ఆ దేశ మేధోసంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్‌‌స భేటీలో మాట్లాడారు. భారత కోల్డ్‌స్టార్ట్ సిద్ధాంతాన్ని(cold start doctrine) ఎదుర్కొనేందుకే ఈ అణ్వాయుధాలను రూపొందించామని వెల్లడించారు. 
పాకిస్తాన్‌తో యుద్ధమంటూ జరిగితే ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ‘కోల్డ్ స్టార్ట్ సిద్ధాంతం’ను రూపొందించింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు వినియోగించకుండా భారత బలగాలు నిలువరించే ప్రత్యేక వ్యూహమే ఈ సిద్ధాంతం. 

ఐరాస వేదికగా పాక్‌పై భారత్ మండిపాటు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగింది. దాయాదిని ‘టైస్తాన్’ అని ఘాటుగా విమర్శిస్తూ.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్ పుట్టినిల్లుగా మారిందని పేర్కొంది. సెప్టెంబర్ 22న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధి ఈనామ్ గంభీర్ పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాక్.. తామే ఉగ్రబాధితులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు ఐరాస సమావేశంలో పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎల్‌వోసీని దాటివస్తే భారత్‌కు దీటుగా సమాధానమిస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమపై ఒత్తిడి పెంచేందుకు భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ రూపొందిస్తున్న వ్యూహాలు విజయవంతం కాకుండా అడ్డుకోగలమని పాకిస్తాన్ పేర్కొంది. 

భద్రత కౌన్సిల్‌లో భారత సభ్యత్వానికి భూటాన్ మద్దతుఐక్యరాజ్య సమితి భద్రత కౌన్సిల్‌లో జీ - 4 దేశాలకు (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) శాశ్వత సభ్యత్వానికి భూటాన్ మద్దతు తెలిపింది. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్‌గే ఈ మేరకు జీ - 4 దేశాలకు శాశ్వత సభ్య కల్పించాలని కోరారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలోను సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. 
పోర్చుగీస్ ప్రధాని ఆంటోని లూయిస్ డా కోస్టా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

అఫ్గాన్‌కు సైన్యాన్ని పంపబోం: భారత్ అఫ్గానిస్థాన్‌కు తమ బలగాలను పంపేది లేదని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. అయితే అఫ్గాన్ అభివృద్ధికి సంబంధించి సహాయం కొనసాగించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఢిల్లీలో భారత్, అమెరికా రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, జేమ్స్ మాటిస్ మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ సాయంపై చర్చలు జరిగాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతోనూ మాటిస్ చర్చించారు. 


భారత్ - జపాన్ మధ్య 15 ఒప్పందాలుభారత్ - జపాన్ 12వ వార్షిక సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సెప్టెంబర్ 14న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయాంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, పౌర అణు శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగాయి. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జపాన్ 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) పెట్టుబడులు పెట్టిందని.. గతేడాది కన్నా ఇది 80 శాతం ఎక్కువని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.

‘రక్షణ’ సహకారానికిభారత్, జపాన్ నిర్ణయంరక్షణ రంగంలో మరింత సహకరించుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 6న జపాన్ పర్యటనలో ఆ దేశ రక్షణ మంత్రి ఇస్తునోరీ ఒనెడేరాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. జపాన్ నౌకా స్థావరంలోని పి-1 హెలికాప్టర్ నమూనాను పరిశీలించారు. జలాంతర్గాములను ధ్వంసం చేసే ఆయుధ సంపత్తి ఉండటం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. జలాంతర్గాముల విధ్వంసక యుద్ధ విధానంలో శిక్షణ ఇవ్వడం పైనా అవగాహన కుదిరింది. రోబోటిక్స్, మానవ రహిత వాహనాలపై సాంకేతిక చర్చలు జరపాలని; నీటిలో, గాలిలో తిరిగే యూఎస్-2ఐ ఉభయచర విమానాల కొనుగోలుపై చర్చించాలని నిర్ణయించాయి.

భారత్, శ్రీలంక నౌకాదళ విన్యాసాలుభారత్, శ్రీలంక సంయుక్త నౌకాదళ విన్యాసాలు సెప్టెంబర్ 7న విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఐదో విడత సంయుక్త విన్యాసాలను రెండు పర్యాయాలుగా జరుపుతారు. మొదటి పర్యాయం సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు, రెండో పర్యాయం సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు నిర్వహిస్తారు.

భారత్-బెలారస్ మధ్య 10 ఒప్పందాలు భారత్ పర్యటనకు వచ్చిన బెలారస్ అధ్యక్షుడు ఏజీ ల్యూకాశెంకో సెప్టెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. ద్వైపాక్షిక సహకారాన్ని విసృ్తతం చేసుకోవడంతో పాటు ‘మేకిన్ ఇండియా’ కింద ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని భారత్, బెలారస్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు చమురు, వ్యవసాయం, సైన్‌‌స అండ్ టెక్నాలజీ, విద్య, క్రీడల రంగాల్లో ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి. 


భారత్, మయన్మార్ మధ్య 11 ఒప్పందాలు 
భారత ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 6న ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం.. 11 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. సముద్ర రవాణా, మయన్మార్‌లో ప్రభుత్వ సంస్థల బలోపేతం, ఆరోగ్యం, ఐటీ రంగాలతో పాటు, ఇరు దేశాల ఎన్నికల సంఘాలు, ప్రెస్ కౌన్సిల్స్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఉత్పత్తుల నియంత్రణ, మయన్మార్ మహిళా పోలీసులకు శిక్షణపై కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. 
మయన్మార్ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో పర్యటించాలనుకునే మయన్మార్ పౌరులకు ఎలాంటి రుసుం లేకుండా వీసాల జారీకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 
సూచీకి ప్రత్యేక కానుక..సిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్‌‌సడ్ స్టడీ(ఐఐఏఎస్)లో ఫెలోషిప్ కోసం 1986లో సూచీ సమర్పించిన పరిశోధన పత్రాల అసలు కాపీల్ని ప్రధాని మోదీ సూచీకి బహుమతిగా ఇచ్చారు. సూచీ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 

అఫ్గాన్‌లో 116 ప్రాజెక్టులు చేపట్టేందుకు భారత్ సంసిద్ధత వ్యూహాత్మక భాగస్వామి అయిన అఫ్గానిస్తాన్ భద్రతా వ్యవస్థ పటిష్టతకు మరింత సహకారం అందిస్తామని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సరిహద్దు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనేందుకు విసృ్తత స్థాయిలో కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు తెలిపింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో అఫ్గాన్ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్ రబ్బానీ సెప్టెంబర్ 11న భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అఫ్గాన్‌లో రక్షణ వ్యవస్థ పటిష్టతతో పాటు అక్కడ కొత్తగా 116 అత్యున్నత స్థాయి అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు సుష్మా ఈ సందర్భంగా వెల్లడించారు.